Wednesday 9 November 2011

Picchimaalokam Contd......


                    దేవుడే  దిగి వచ్చి ఆ రూపంలో ఉన్నా పట్టించుకునే తీరిక అవసరం ఎవరికీ లేవు . పైగా గుడిలో ఉండాల్సిన దేవుడు ఇక్కడ ఉన్నాడేమిటి? స్థాన భ్రంశం చెందాడేమిటి? అయినా దేవుడు కదా విహారానికి వచ్చి తానే తిరిగి గుడిలోకి వెళ్ళతాడని నిశ్చయించుకుని ప్రశాంతంగా రోజులు గడిపేస్తారు.

           ఎవరి స్వార్థం వాళ్ళని మాయపొరలా కమ్మేసింది. ఎవరి గోల వారిది. మా జీతం స్కేల్ పెరగలేదని ఒకళ్ళు , ప్రిన్సిపాల్ ఏదో అన్నారని ఒకళ్ళు , తరచూ ఒకళ్ళ మీద ఒకళ్ళు బాణాలు స౦ధి౦చుకు౦టూ వేరొకరిని బాధపెడుతూ  తాము బాధపడుతూ కాలం  వెళ్ళబుచ్చే కొందరు. ఇంట్లో పనుల దగ్గరి నుంచి కళాశాల బాధ్యతలు  , బస్సులకై ఎదురుచూపులు, రోజూ  ప్రయాణం ఈ  చట్ట్ర౦లో ఇరుక్కున్న మా వత్తిడి పరుగుల  బ్రతుకులు, హడావుడి రోజూ అతను గమనిస్తూనే ఉండేవాడు.     

     తీక్షణమైన అతని చూపులో చూపు కలిపి ఏ భావము లేని నిర్లిప్తమైన చూపులను చూడాలంటే భయం వేసేది . వెంటనే కనుచూపు మరల్చుకునే దాన్ని. ఒకోసారి ఎవరు పిచ్చివాళ్ళు అనే ప్రశ్న నా మదిలో ఉదయించేది. ప్రశాంతంగా నింపాదిగా ఉండే అతనికి ఎప్పుడు పరుగులు పెట్టే  ప్రపంచం ఓ పిచ్చిమాలోకమే కదా.

         ఒక సంవత్సరం తరువాత వరుసబెట్టి  మూడు రోజులు కనిపించలేదు . ఏంటి అతను కనిపించడం లేదంటే మీకు తెలియదా మొన్న రాత్రి పాము
 కాటు వేసి అతడు చనిపోయాడు అన్నారు. అది అస్సలు కారణమా అనే సందేహం కలిగింది . పాముని  చూసి జాగ్రత్త పడలేని వాడు ఎన్నో సంవత్సరాల నుండి ఎప్పుడూ పాములు తిరుగుతుంటే  ఆ ప్రదేశంలో ఎలా బ్రతక గలిగాడో అర్థం కాలేదు.

        అప్పుడు వచ్చిందట అతని కోసం ఒక మున్సిపాలిటీ వ్యాన్ మార్చురీకి   తీసుకు వెళ్ళడానికి అదీ ఎవరో కంప్లైంట్ చేస్తే. తోటి మనిషి పట్ల స్పందన
 ఎలాగో  ఎవరిలోనూ లేదు అతని చావులో కూడా జోక్స్ వెతికి వెకిలిగా నవ్వుకున్నాము. ఈ కళాశాల వొదిలి ఎక్కడికి వెళ్ళతాడు దెయ్యమై తిరుగుతాడని కాని మా అందరి మనసుల మాటున ఒక సన్నని భయం  ప్రకంపనం  ఇప్పటికీ అతని భీభత్సమైన దయనీయమైన చావుని తలచుకోగానే కలుగుతుంది.

     డబ్భు , బంధువులు , అన్నిటినీ మించి మతి లేకపోతే ఎవరైనా ఎప్పుడైనా ఆ స్థితికి చేరుకోవచ్చు. మనల్నికాచడానికి ఈ సమాజం ఎన్నోసోషల్ వెల్ఫేర్,  యన్. జి . ఓ లు , అనాథ  శరణాలయాలు ఒక మతి భ్రష్టుడిని అక్కున చేర్చుకోలేక పోయాయి. ఎయిడ్స్  రోగి నుండి వ్యభ్యచారుల వరకు ఎవరి
కైనా సహాయంగా నిలుస్తామనే సమాజం మతిహీనుల పట్ల ఇంత నిర్దయగా ఎందుకు ఉంటుందో,  బహుశా కలకాలం వాళ్ళని పోషించి , కనిపెట్టుకుని  ఉండాలి కాబట్టేమో.

    కాని  అతడు మాత్రం ఈ పిచ్చి మహా లోకం నుండి  కర్మయోగిలా నిష్క్రమించాడు. ఏమో  అతడే ఏ దేవుడో మారురూపంలో వచ్చిఉంటే ? అల్ పవర్ ఫుల్  అవతార పురుషులనే దేవుడని నమ్మే మనుషులం మనం. దేవుడిని మతిభ్రష్టుడిగా ఊహి౦చగలమా? 
  
        పాపులు ఎవరు? దయనీయమైన స్థితి నిజంగా ఎవరిదీ? నిజంగా మతి   భ్రష్టులు ఎవరు? 

    తోటి మానవులకి చేయూత నివ్వలేని మన దయనీయమైన నిస్సహాయ స్థితికి అతడే బహుశా జాలిపడి తాను మాత్రం స్వచ్చంగా, స్వేచ్చగా, నిశబ్దంగా                     
లోకాన్ని  వోదిలివెళ్ళిపోయాడు. బహుశా బుద్ధిమంతులు , నిస్వార్థులు ఉన్న లోకాలకి తరలి వెళ్ళిపోయాడేమో!


    అతనికి ఏ విధంగాను సహాయపడని నా చేతకానితనానికి ఒక శిక్ష  పడని నేరస్తురాలిలాగా అపరాధ భావంతో ముందుకు సాగిపోయాను.


     నాలుగు రోజుల తరువాత మా కాలేజీ గేట్ ముందు ఇంకో క్రొత్త పిచ్చివాడు కనిపించాడు.దేశంలో దేనికి కరువులేనట్టే  హతవిధీ ఈ పిచ్చివాళ్ళకి కూడా కరువు లేదు కదా అనిపించింది.    
        
                    

Wednesday 2 November 2011

Picchimaalokam


                    చూడటానికి  స్ఫూరద్రూపం చక్కని తీరైన ముఖకవళికలు , తేజోవంతమైన కంటిచూపు నాగరికుల మధ్య అందగాడే అని చెప్పొచ్చు. కాని అతడు ఒక పిచ్చివాడు. అది అందరు ఇచ్చిన నామధేయం అతనికి.టౌనుకి దూరంగా విసిరేయబడ్డట్టు రోడ్డుకివతల ఒక కళాశాల ముందు గేట్ బైట ఆవరణలో ఒక మురికి కాలువా ప్రక్కన కూర్చుని ఉండే వాడు.చిరిగిన బట్టలు, మాసిన గడ్డం మొదటిసారి చూసిన వారికి భయం కల్పించేటట్లు ఉంటాడు. అతన్ని దీక్షగా చూస్తే అన్నీ పరిత్యజి౦చిన ఏ యోగియో కాదు కదా అనిపిస్తుంది. ఎక్కడ తినే వాడో, రాత్రంతా ఒంటరిగా , చలిలో ఎలా ఆ నిర్మానుష్యమైన ప్రదేశంలో ఉండగలిగేవాడో తెలియదు. 

                 అందరు అతని గురించి తలో రకంగా జోక్స్ వేసేవారు. ఒకరు ఆ కళాశాలలోనే చదివేవాడు అంటే బాగా చదివి అలాగైపోయాడు అని ఇంకొకళ్ళు, మరేదో సందర్భంలో ఇంకొద్ది రోజులకి ఇలా పాఠాలు చెప్పి మనము అలాగే తయారు అవుతాం అని నవ్వుకునే వాళ్ళం.ఒకోసారి బైటే కాదు లోపల కూడా పిచ్చాళ్ళు ఉన్నారని విస్సుక్కునే వాళ్ళం. కొందరికి అతడు ఏ గూఢచారో, టెర్రరిస్ట్ లాగ కనిపించేవాడు. 


                అతడు  చిత్రంగా ఎప్పుడూ ఒక దినపత్రిక పట్టుకొని దాన్ని చదువుతున్నట్లుగా ప్రవర్తించేవాడు , ఒకోసారి ఏదో అర్ధం కాని వాక్కులలో అరుస్తూ చదివేవాడు. ఆ తరువాత ఆ పేపర్లని గోడకి అ౦టి౦చేవాడు. బహుశా అన్నం మేతుకులతో  కావొచ్చు. ఇదంతా మేము రోడ్ మీద బస్ కోసం ఎదురు చూసేటప్పుడు గమనించేవాళ్ళం. మా నాన్ టీచింగ్ స్టాఫ్ లో ఓ  బ్రహ్మచారి దాదాపు రోజు అతడికి అన్నం పెడుతూ ఉండేవాడు. 

             అతడిని పరిశీలించినా కొలది అతని గురించి ఆలోచించేదాన్ని. ఇతను ఎలా ఈ స్థాయికి దిగజారాడు. అతని తరపు వాళ్ళు కనీసం ఒక్కరైనా లేకపోవటం ఏమిటి? పిచ్చివాళ్ళ  ఆసుపత్రులు ఉన్నాయి కదా కనీసం మునిసిపాలిటి వాళ్ళు అతన్ని అక్కడికి చేర్చవచ్చు కదా అనిపించేది.
           
    అయినా మునిసిపాలిటి వాళ్ళ బాద్యత చచ్చిన శవాలని తీసుకువెళ్ళడం, కుక్కలని , పందులని మోసుకెళ్ళడం,చెత్త చెదారం ఊడవడం మురికి కాలువలు శుభరం చెయ్యడం ఇవి కదూ వాళ్ళ సోకాల్డ్ డ్యూటీస్.                

        కాబట్టి అతడి మీద కంప్లైంట్ ఇస్తే ఊర్లో కుక్కలని తీసుకు వెళ్ళినట్లు తీసుకు  వెళ్లేవాళ్ళేమో కాని ఆ కంప్లైంట్ ఎవరివ్వాలి కళాశాల యాజమాన్యమో , ప్రిన్సిపాలో ఇవ్వాలి. కాని వాళ్లకి అంత తీరిక , అవసరము, ప్రయోజనము ఏవి కనిపి౦చి ఉండకపోవచ్చు 

    అదే రోడ్డు మీద ఎన్ని జనసమూహాలు తిరిగేవి , ప్రొసేషన్స్ , కార్యకర్తలు జెండాలు ఊపుకు౦టూ నినాదాలు చేస్తూ కాని ఎవరు అతడ్ని పట్టించుకోలేదు బాట ప్రక్కన వాడిపోయిన గడ్డిపూవులా అతడు అన్నిటికి సాక్షిభూతుడై అలాగే  నిస్సంగత్వమో, నిర్వేదమో మునీశ్వరుడిలా అన్ని గమని౦చేవాడు కనీసం ఆ రోడ్డున వెళ్ళే ప్రజానాయకుల దృష్టిలో పడలేదంటే మన నాయకులు ఎన్ని సమస్యలతో  సతమతమవుతున్నారో అర్ధం  చేసుకోవచ్చు.  


  
                                              to be continued.................