Tuesday 30 May 2017

PANTHULAMMA

                                                                 పంతులమ్మ 

                                                                     

                             ఆకుల సవ్వడి .... పాదాల క్రింద ప్రతి అడుగులో, రాలి ఎండిన ఆకుల విరిగిన ధ్వని, అడుగు అడుగుకి లయబద్దంగా ధ్వనిస్తుంటే ప్రక్కనే అతని పాదం చేస్తున్న సవ్వడిలో లయిస్తుంటే ఇరుపాదాల జత నర్తన అడుగుల తాళం వేస్తుంటే తాదాప్యం తో శబ్ద పద గతులలో  లీనమై                ప్రవహిస్తుంది వారిరువురి ఆ నడయాడే ఝరి, హృది తరంగిణి. 

                          దారంతా పరుచుకున్న పసుపు పచ్చ ఎండుటాకుల తివాచీ. ఇరు వైపులా చెట్ల స్తంభాలకు పూచిన ఎర్రటి విరులు వంగిన కొమ్మలకి వేలాడుతున్న శాండిలీర్స్ లా ఊగిసలాడుతూ ఆహ్వానిస్తుంటే వారిరువురి నయనాలు తన్మయత్వం పరిసరాలలో విలీనం అయి భువిలో దీవిని దర్శిస్తున్నాయి.
                            
                 
                          పరిసరాల మీద దృష్టిని మరల్చి తన ప్రక్కన అడుగులిడుతున్న మనిషిని నిశితంగా పరిశీలించి మరీ చూసింది మృదుల . సాత్వికత అంతా రాశి పోసినట్లున్న ముఖారవిందం.  వెన్నెలంతా చిరునవ్వు పలువరుసలో, తియ్యందనమంతా  గులాబీరంగు  పెదవులలో, చిలిపితనమంతా బుగ్గ సొట్టలో ఇముడ్చుకున్న ప్రశాంతవసనం ఆ వదనం . నిర్మలత్వం నిండుగా నింపుకున్న కనుదోయి రాజసం ప్రదర్శితున్న బాహుద్వయం  గాంభీర్యం ఉట్టిపడే పొడగరితనం. 

                        చక్కటి పంచెకట్టు ఖద్దరు లాల్చీ  నుదిటిన కనుబొమ్మల మధ్య హిందూ సాంప్రదాయాన్ని చాటుతూ కుంకుమ బొట్టు తో రవీంద్ర నాథ్  టాగోర్ 'గోరా' ని తలపిస్తున్నాడు. అబ్బా ఎంత అందం ఈ ఊరి సుగుణాభిరాముడేమో అనుకుంది మృదుల . 

                        " తీర్చిన  బొమ్మలా తీరైన వాడు  తీరని రుణమేదో తీర్చుకో వచ్చాడు," పాట గుర్తుకు వచ్చి పెదాలపై చిరునవ్వు నింపుకుంది మృదుల .

                         అదే రోజు అర గంట ముందు అతనిని కలిసిన తీరు గుర్తుకు తెచ్చుకోసాగింది మృదుల . బస్సు ఊరి ముందు నల్లటి తారు రోడ్డు మీద ఆగింది. మీ ఊరు వచ్చింది కండక్టర్ చెబితే మెల్లిగా ఓ సూట్ కేస్ పట్టుకుని దిగింది మృదుల.

                        నల్లటి తారు రోడ్డుకి అటు ఇటు పచ్చని పొలాలు . అస్సలు ఊరెక్కడో అనుకుంటూ  అటు కేసి పరుగెత్తుకుంటూ వస్తున్న ఓ బుడతడిని అడిగింది . " ఈ పొలాలెంట పోవాలె ", తల ఎత్తి అయినా  చూడకుండా ఆగకుండా సైకిల్ టైర్ ని  ఓ చేత్తో పట్టుకున్న కర్రతో  తిప్పుతూ ఇంకో చేత్తో నిక్కరు పైకి లాక్కుంటూ పరిగెడుతున్నాడు. మధ్య లో కర్ర ,నిక్కరు ఎంతో లాఘవంగా చేతులు మార్చుకుంటూ వాడి పరుగు, వాడు కనుమరుగైయే వరకు చూసి చదువు సంధ్య లేకుండా వీడికి రోడ్డు మీద ఆటలేమిటి ఈ నీరెండలో అనుకుంది మృదుల. 
                        
                      కానీ మృదులకి తెలియని విషయం పంతుళ్ళే లేని బడి ని  ఎవరు తెరిచి పాఠాలు చెబుతారు బుడతడి కోసం. అందుకే వాడు రోడ్డున పడ్డాడని ఆట ధ్యాసే వీడడని. వాడి లాంటి పరిస్థితి  ఆ ఊరిలో అందరు  బుడతడులది అని . అటు వంటి బడి తలుపులు తెరిచి దాన్ని ఓ గుడిగా విద్యాలయంగా మలచడానికే తాను ఆ పల్లెటూరిలో అడుగిడుతుందని.
            
                  " ఎలా వెళ్ళాలి ఊరికి చేను గట్టుమీద నడుచుకుంటూ ,సర్కస్ ఫీట్ చేయాలేమో , ఎలా భగవంతుడా," అనుకుందో లేదో భగవంతుడిలా దర్శనమిచ్చింది ఓ మానవ రూపం . ఊరికి దారిటు నేను అటే వెళుతున్నా అన్నాడు .అహా ఏమి నా భాగ్యం అనుకుంటూనే ఏదో అనుమానం వచ్చి " మీకెలా తెలుసు నేను ఊళ్లోకి వెళ్లాలని ," అడిగింది. అతని నుంచి  జవాబుగా ఓ చిరు మందహాసం ఎదుర్కోవాల్సి వచ్చింది . అవును కదూ ఎటు వైపు చూసినా చేలు . ఒక్క పురుగూ లేని  హైవే  రోడ్ మీద ఒంటరిగా సూటకేస్ తో ఊరి వైపు చూస్తూ నిలబడితే అర్థం ఇంకేమొస్తుంది . అడిగిన తన తెలివి తక్కువ తనానికి వెక్కిరిస్తున్నట్లుంది  అతని మందహాసం . "ఆముందెళ్ళిన  పిల్లాడు చెప్పుంటాడు," అనుకుంది తన తెలివి తక్కువతనాన్ని ఒప్పుకోలేని ఉడుకుమోతుతనంతో. 
               
                      ఎందుకైనా మంచిదని తన గురించి తానే చెప్పేసుకుంది . "నేను ఈ ఊరి స్కూల్ కి కొత్తగా అప్పాయింట్ అయిన టీచర్ ని . సర్పంచ్ ఇంటికి వెళ్ళాలి." చేను గట్టు ఎక్కలేక సతమతమౌతున్న తనకి చేయూతనిచ్చి తరువాత చేనుగట్టు మీద సూట్ కేస్  తో నడవలేక కష్టపడుతున్న తనని చూసి వంగి సూట్ కేస్ అందుకున్నాడు. అదే పది వేలు అనుకుని  బిడియంతో జాగ్రత్తగా అతని వెనుక అడుగులు వేస్తూ, తొలి అనుభవమైన చేలగట్టు మీద నడకలో  లీనమై మొదటి సంవత్సరపు బుడతడి అడుగులలా కసరత్తు చేస్తూ నెమ్మదిగా గట్టు చివరకు చేరింది. ఎలా దిగాలో అర్థం కాని తనకి చేయందించి దింపిన అతన్ని చూసి థాంక్స్ అందే కాని అతని చేతిలో సూట్ కేస్ మాత్రం తీసుకోలేదు.  అతనూ ఇవ్వలేదు. దాని సంగతే  మరిచినట్లు . 

                 మృదుల ఒక్కసారి వెనుతిరిగి చూసింది. ఇరువైపులా పచ్చని పొలాలపై  ఊగిసలాడే పైరగాలిని మొదటిసారి తన్మయత్వంతో ఆస్వాదించింది. ఆ పొలం గట్టు మీద నడకే ఇబ్బంది పెట్టకపోతే ఇంకెంత  బావుండునో అనుకుంది . అయినా అదీ ఓ గమ్మతైన అనుభవం అని నిటూర్చింది . 

                   పొగమంచులా మనస్సంతా అలుముకున్న ఆ అనుభూతి  అక్షరమై ఘనీభవిస్తే 'ఆహ్లాదం' గా ఓ రూపాన్ని సంతరించుకుంటుందేమో ! 

                  ముందుకి చకచక నడచి వెళ్ళిపోతున్న అతన్ని గబగబా నడచి చేరుకుంది మృదుల అతని ప్రవర్తన గురించి ఆలోచిస్తూ . ఎక్కడా కళ్ళలోకి కళ్ళు పెట్టి  చూడని సంస్కారం , చేగట్టు ఎక్కి దిగేటప్పుడు దానిపై నడిచేటప్పుడు , వెనకాతల సరిగ్గా  నడిచొస్తుందా లేదా అని ,జాగ్రత్త కోసం అన్నట్లు వెను తిరిగి చూసిన అతని చూపులు కేవలం తన అడుగులిడుతున్న పాదాలను మాత్రమే చూసాయి. వాళ్ళ ఊరి స్కూల్ టీచర్  అని గౌరవమేమో అనుకుని మురిసి నవ్వుకుంది మృదుల. 


                     బస్సు లో , రద్దీగా ఉన్న ప్రతి ఏరియా లో స్త్రీ ని  ఎలా తాకుదామనే ప్రయత్నించే వెధవలు , ఒక చోట నిలబడ్డా నడుస్తున్నా పై నుంచి క్రిందికి వికారంగా  చూసే వెధవలు ఉండే సిటీ నుంచి వచ్చింది కదా అందుకే అస్సలు చూడనట్లు ఉన్న అతని చూపులకు ఆశ్చర్యంతో  నీరాజనం పడుతున్న  మృదుల మానసం తనలో అతని సంస్కారం కలిగించిన భావోద్వేగానికి ఆనందించింది.

                           మౌనంగా  ప్రకృతి భాష  వింటూ  కొనసాగుతున్న వారిద్దరి పయనoలో  విరామంలా , దూరంగా ఉన్న ఓ  వ్యక్తి వీరిని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి అతని చేతిలోని సూట్ కేస్ తీసుకున్నాడు . " పంతులమ్మని సర్పంచ్ ఇంటికి తీసుకుని వెళ్లు ," అని వెనుతిరిగినతనితో   థాంక్స్ అని గభాలున అంది మృదుల . నో మెన్షన్  అని తిరిగి చూసి ఓ  చిన్న నవ్వు రువ్వి వెళ్ళిన అతని వైపే చూస్తూ ఇతగాడికి ఇంగ్లీష్ కూడా వచ్చే ఎంత వరకు చదివాడో అని అనుకుని ముందుకు నడిచింది . 

                          ఇంత సేపు నోటికి తాళం వేసి నట్లు ఉన్న తను ప్రకృతి  లోకం లోంచి ప్రస్థుతంలోకి ఊడిపడ్డట్లు ప్రశ్నలు వేయడం మొదలు పెట్టింది. తన నోటిలోంచి వచ్చిన మొదటి ప్రశ్న " అతను ఎవరు ? " 

                            " మా దొర ... సర్పంచ్ " ఒక్క క్షణం ఆగి మరీ అంటూ మృదుల కేసి మా దొర ఎవరో తెలియక పోవడం ఎమిటీ అన్నట్లు వింతగా చూసాడు . ఆ చూపులో మా దొర ఎవరో తెలియకుండానే ఇంత దూరం తనతో కలిసి వచ్చావా అనే ప్రశ్న, మా సర్పంచ్ చేత సూట్ కేసు మోయించావనే   కినుక కనిపించాయి మృదులకి. ఇంక వాళ్ళ సర్పంచ్ పేరు అడిగే  దైర్యం చేయలేకపోయింది. 

                          " పల్లెటూరి వాళ్ళతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలమ్మా , ఆవులిస్తే పేగులు లేక్కె ట్టేస్తారు ," పక్కింటి బామ్మ మాటలు గుర్తుకు వచ్చాయి మృదులకి .  ఆ ఊరి బడి గురించి , కిరాయి ఇళ్ల గురించి వాకాబు చేస్తూ తను మెల్లిగా అడిగిన ప్రశ్నలకి పొడి పొడిగా సమాధానాలు ఇచ్చాడు . ఆఖరికి పేరు అడిగితే " మల్లయ్య " అని అన్నాడు. ఇదే సర్పంచ్ ఇల్లు అంటూ వీధి  మొదట్లో ఉన్న బంగళా వైపు చూసాడు. గేట్ తీసి ముందులోపలికి అడుగు పెట్టాడు మల్లయ్య . 
                           ఇల్లు 
                                    ముందు పెద్ద ఖాళీ స్థలంలో  కొన్నిఖాళీ కుర్చీలు వేసి ఉంచారు . సుమారు ఒక యాభై నుంచి అరవై లోపల ఉండే పెద్దమనిషి ఓ కుర్చి లో  కూర్చుని తన ఎదురుగా చేతులు కట్టుకుని తలపాగా సంకనెట్టుకుని పైన చొక్కా లేకుండా వంగి వంగి మాట్లాడుతున్న వ్యక్తిని ఏదో అడుగుతూ ఉన్నాడు. 

                                 మా పెద్ద దొర అన్నాడు. దగ్గరికి వెళ్ళాక రెండు చేతులు జోడించి నమస్తే అంది మృదుల . " పంతులమ్మ అంట దొర చినబాబు పంపాడు "   అన్నాడు. ఆ పెద్ద మనిషి సాలోచనగా తన వైపు చూసి " ఇక్కడ ఉండొచ్చు . స్కూల్ కి రేపు వెళ్ళి చూడొచ్చు . స్కూల్ తాళాలు సర్పంచ్ ఆఫీస్ లో ఉంటాయి తెప్పిస్తాను, " అన్నాడు. 

                                "యాదమ్మా," అని పిలిచి ప్రక్క కుర్చీలో  ఉన్న న్యూస్ పేపర్ చేతిలోకి తీసుకుని చూడసాగాడు . నలభై ఏళ్ల వయస్సు ఉండే ఒకామె దాదాపు పరిగెత్తుకుంటూ వచ్చి రండమ్మా అంది . థాంక్స్ అండి అని పెద్దాయనకి కృతజ్ఞతలు చెప్పి రెండు అడుగులు వేసిందో లేదో "మీరేమిటోళ్ళమ్మా " తన చేతిలో సూట్ కేసు తీసుకుంటూ అడిగిన యాదమ్మని ఆశ్చర్యంగా చూసింది మృదుల. 

                                 పచ్చని పల్లెటూళ్ళలో  ఆనవాలుగా ఆ భీజం మొదలై వితై , నాటై, వేరై, మొకై, మానై, వృక్షమై శాఖోప శాఖాలుగా విస్తరించి పట్నాలకి చేరి, దేశం నలుమూలలా పాకి విదేశాలను సైతం చుట్టేస్తున్న కుల వ్యవస్థ, మొదలేదో అంతమేదో తెలియని చిత్రమైన వ్యవస్థ . సంఘటిత శక్తి మరుగున కుల వివక్షత అదృశ్య హస్తం మృదుల మానసాన్నికాస్త కరుకుగానే  తాకింది. 

                               " ముందు చిన్నమ్మ గదిలో పంతులమ్మ సామాను పెట్టు" పెద్దాయన ఆజ్ఞలో మందలింపు వినిపించిందేమో గమ్మున ఇంట్లోకి సూట్ కేస్ తో  సహా వెళ్ళింది యాదమ్మ . వీళ్ళ ఆశ్రయం పొందటానికి ఇదో అర్హత  ఏమో అని సందేహ పడ్డ మృదుల బ్రతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకుంది . తన వృత్తిలో , తన జీవితం లో  అదే పెద్ద సమస్య అవుతుందని తెలియని మృదుల సంకోచించినా ధైర్యంగా ముందుకు అడుగే వేసింది. 

                               ఒక పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయి, "మీరేనా మా బడి పంతులమ్మ రండి" అంటూ చిరునవ్వుతో స్నేహపూర్వకంగా పలుకరించింది  
తనలో సర్పంచ్ పోలికలు కనిపించాయి . తన చెల్లెలే అయి ఉంటుంది అనుకుంది . కానీ ఆ అమ్మాయిలో వయస్సు కి  మించిన పరిపక్వత కొట్టొచ్చి నట్లు  కనిపిస్తూ  వుంది. మానసికంగా రాణిలా ఎదిగినా శారీరికంగా ఒదిగిన రాజకుమారిలా ఉంది. నా పేరు లావణ్య అన్నది . పేరుకి తగ్గ రూపు అనుకుంది మృదుల . నా పేరు మృదుల అనగానే ,  మేమంతా మిమల్ని పంతులమ్మా అనే పిలుస్తాము అంది. మొదటిసారి అతని నోటి వెంట వినప్పుడు చిత్రంగా అనిపించినా, " పంతులమ్మ"  తనలో తానే అపురూపంగా అనుకుని నవ్వుతూ, పేరు బావుంది అని  మరోసారి ఆ కొత్త బిరుదుని తనలో తాను పునరావృతం చేసుకుని కూసింత గర్వపడింది  మృదుల. 
                         
                          గృహాలయం ... ప్రకృతి నీడ 
                                 ప్రాకృతిక ఆలంబన 

                                    ఇంటి లోపల అడుగుపెడుతూనే ఇంటి పరిసరాలు గమనించింది మృదుల .చాలా పెద్ద పొడుగు హాల్ , అటు ఇటు గదులు . హాల్ చివరన ఎదురుగుండా తెరిచిన ఓ తలుపు ' వెనక వసారాలోకి దారి చూపిస్తూ . ఆ తలుపు ప్రక్కగా మెట్లు పైన చుట్టూరా గదులు.  ఇన్ని గదులా! తరగతి గదుల్లా ఉన్నాయి అనుకుంది . ఆడంబరంగా లేకపోయినా సాంప్రదాయంగా ఉంది ఆ బంగాళా . రండి అంటూ వెనుక ద్వారం గుండా బైటికి తీసుకు వెళ్ళింది లావణ్య . వెనుక కూడా ఖాళీ స్థలం ఒక వైపు చక్కని పూలమొక్కలు , కాయగురల మొక్కలు . కాళ్ళు కడుక్కోమని అనకుండానే  "కాళ్లు కడుక్కునే చోటు" అని చూపించింది.  వెంటనే ఓ ఇత్తడి బకెట్టు లో నుంచి ఇత్తడి చెంబునీళ్లతో  కాళ్ళు కడుక్కుంటూ తాను కడుక్కుంటున్న నీళ్లు వృధా కాకుండా మొక్కలకి పారడం గమనించింది . నీటిని అలా వృధా కాకుండా వాడుకుంటున్న తెలివికి ముగ్దురాలైంది. 
                          మొక్కలు మల్లెలు , కనకాంబరాలు చేమంతులు బంతులు గులాబీలు మందారాలు సన్నజాజులు గుండుమల్లెలు నందివర్ధనం రంగురంగుల శంఖు పూలు ఓ చిన్న పూలతోటకు మల్లె ఉంది ఆ తోటలో  ఓ మూలన పారిజాత వృక్షం. ఇంకో వైపు అన్ని రకాల కూరగాయ మొక్కలు పాదులు అక్క్డక్కడ దూర దూరంగా నాలుగు అరటి చెట్లు జామ చెట్టు పెద్ద వేపచెట్టు అన్నింటి మధ్య ఎదురుగా అలికి ముగ్గులతో తీర్చి దిద్దిన ఓ చక్కటి తులసి కోట కుడివైపున  పెద్ద చేదుడు బావి దాటి ముందుకు వెళితే దూరంగా ఎడమవైపు మూలాన పెద్ద గదులు . "ఊర్లల్లో  మరుగు దొడ్లు ఇళ్లల్లో ఉండవు అస్సలు లేకపోయినా విచిత్రమేమి లేదు నీకు కష్టమే"  పక్కింటి బామ్మ అనడం గుర్తుకు వచ్చింది.  


                       పుస్తక నిలయం .... పుస్తకాలయం 
                                         మరో ప్రపంచం 

                 నాలుగు రోజుల తరువాత "ఏమైనా బుక్స్ ఉన్నాయా ? " 
తనతో బాటు తెచ్చుకున్న నవల చదవడం అయిపోయాక అడిగింది లావణ్యని. " మీకు తెలుగు సాహిత్యం అంటే ఇష్టమా ?" అడిగింది లావణ్య . "ఊ" కొట్టి తలూపింది మృదుల . 

                  నాతో రండి అంటూ ఒక గడియ  వేసున్న గదికి తీసుకు వెళ్ళింది . ఆ గది హాల్ మధ్యలో కుడివైపున ఉంది . తలుపు తెరిచిందో లేదో లోపలి దృశ్యం చూసి  ఒక్క క్షణం తనని తాను మైమరచిపోయింది. సిం సిం ఖుల్జా అని ఆలీబాబా అంటే తెరుచుకున్న ధనాగారం లా తన కళ్ళ ముందు పరుచుకున్న ఓ పెద్ద గ్రంథాలయం. గది చిన్నదే కానీ గది నిండా పై కప్పుని  తాకేటంత అరలు , ఆ అరల నిండా పుస్తకాలు . పట్టలేని సంతోషం తో గది మధ్యలోకి వెళ్ళింది. ఒకో మనిషికి ఒకోటి ఆనందం ఇస్తుంది . మృదులకి అన్నింటినీ మించిన ఆనందం పుస్తకాలలో దొరుకుతుంది. 

                        గది నిండా బొమ్మలని మొదటిసారి చూస్తున్నట్లు తన కళ్ళలో మెరిసే ఆనందంతో అమాయకపు పసితనంతో ఏదో వింతైన క్రొత్త లోకంలో  ఉన్నట్లు ఉన్న మృదులని  చూసి నవ్వుతూ " చాలా ఇన్ని పుస్తకాలు " అంది లావణ్య.  తను కూడా నవ్వేస్తూ "నాకైతే ఆలిస్ ఇన్ వన్డర్లాండ్ లా ఉంది" అన్నది మృదుల.  

                                    " ఏ పుస్తకాన్ని తీసినా యథా స్ధానంలో పెట్టేయండి అన్నయ్యకి కోపం వస్తుంది" అంది లావణ్య , మృదుల మంచంనిండా పరుచుకునే పుస్తకాల సంగతి గుర్తుకు వచ్చి. "ఇక్కడే కూర్చుని చదవాలా ?" నిరుత్సాహ పడిపోతూ అడిగింది మృదుల. "అవును అన్నయ్యకి పుస్తకాలు బైటికి తీసుకు వెళ్లడం ఇష్టం ఉండదు" లావణ్య కచ్చితంగా  గా చెప్పేసింది. 
చక్కటి ఆరుబయట వాతావరణం లో కూర్చుని మంచి  పుస్తకం చదవడం లో    ఆ అందమైన అనుభూతే వేరు అనుకుంది. అయినా సర్దుకుపోయినట్లు సరే ఇక్కడే కూర్చుని చదువుతాను అంది. 

                             ఆ గదిలో ఓ కిటికీ దగ్గరగా  కూర్చుని చదవడానికి చిన్నబల్ల , కుర్చి, బల్ల మీద ఓ టేబుల్ లాంప్, ఓ దివాను పొందికగా అమర్చి  ఉన్నాయి. అప్పుడు గమనించింది గదినంతా దేదీప్యమానం చేసే కొన్ని  బల్బులు, పై కప్పునుంచి వేలాడుతూ రెండు సాండ్లియర్స్ కూడా ఉన్నాయి. 

                            శుభ్రంగా చక్కగా తీర్చిదిద్దినట్లు ఉన్న ఆ గ్రంథాలయాన్ని  చూసి సాహిత్యం  పట్ల ఉన్న అతని శ్రద్ద ఓ అందమైన ఆనందాన్నితన  కైవసం చేసింది. ఆ పుస్తకాలన్నీ అందాల సాహిత్య వనిలో పుష్పాలు  అయితే తన మానసం ఓ సీతాకోక చిలుకై పుష్పాలను రంగుల రెక్కల తో చేరుకుని ప్రతి పుష్పం పై వాలి తన్మయత్వంతో ఆ దివ్య సాహితీ మధువును  గ్రోలి రసాస్వాదన  చేస్తున్న అనుభూతికి లోనైంది. 

                                యథాలాపంగా ఓ పుస్తకాన్ని చేతిలోకి తీసుకుని మొదటి  పేజీ తిప్పింది పేజీ క్రింద కుడివైపు చివరన అతని సంతకం , ఆ పుస్తకం చివరి పేజీలో కూడా అదే సంతకం . మొదటి సంతకం తన పుస్తకమని , ఆఖరున ఉన్న సంతకం తాను ఆ పుస్తకం చదివేసానని తెలుపుతుందేమో ! ఆ రెండు సంతకాల వెనుక ఉద్దేశ్యం ఏమై ఉంటుందో అనుకుంది మృదుల. మృదులకి పుస్తకాల మీద పేర్లు వ్రాసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు . పుస్తకం ఎప్పుడూ కొత్తగానే అనిపించాలని తన కోరిక. పేరు రాసుకోవడం అంటే పుస్తకం అందాన్ని తగ్గించినట్లే అనుకునేది . కానీ అతని పేరు పుస్తకం లో చూసాక ఆ పేరే ఆ పుస్తకం అందాన్ని ఇనుమడింపజేసిందనిపించింది. మొదటి సారి అతని పేరు తనకు తెలియ వచ్చిన విధానం గుర్తుకు తెచ్చుకుంది. 

                                 తాను వచ్చిన మర్నాడు ప్రొద్దున్న  తొమ్మిది గంటలకి యాదమ్మ "ఇవిగో దొరా , సర్పంచ్ బాబు స్కూల్ తాళాలు పంపినారు" అని పెద్దాయన ఊగుతున్న చెక్క ఉయ్యాల బల్ల చివర అంచున ఏదో కాగితం పెట్టి దాని మీద తాళంచెవుల గుత్తి ఉంచింది . " పంతులమ్మ ని  పిలవమంటారా?" అని అడుగుతుంటే విని దగ్గరికి వెళ్లిన మృదుల చేతికి తాళం చేతుల చిన్న గుత్తి , ఒక కాగితం ఇచ్చారు పెద్దాయన . తన జాబ్ ఆర్డర్ జిరాక్స్ కాపీ , క్రింద సర్పంచ్ స్టాంప్ పైన సంతకం ఉంది . 

                       పరీక్షగా ఆ సంతకాన్ని చూసి చదువుకుంది , "శరత్ చంద్ర"
ఎంత చక్కటి పేరు ! ఇంత కంటే అందమైన పేరు ఉంటుందా ? శరదృతువున శారద రాత్రులు , నిండు చందమామ వినీల జ్యోత్స్నలు ఒకేసారి తన కళ్ళ ముందు పరుచుకున్నాయి. అవని వొళ్ళంతా పరుచుకున్న వెన్నెలలో మబ్బులు లేని ఆకశాన చల్లని చంద్రుని దరహాసం తన హృదిని మీటుతున్న మృదు భావన మృదువుగా మృదుల హృదయాన్ని ఆ అందమైన పేరుతో పెనవేసుకుంది. 

                           "పంతులమ్మా", యాదమ్మ పిలుపుతో గబుక్కున  జ్ఞాపకం లోంచి  గతం గడప దాటి ప్రస్తుతం లోకి  అడుగిడుతూ చేతిలోని పుస్తకం పేరు చదివింది "పరిణీత "  శరత్ చంద్ర వ్రాసిన నవల. యాదృచ్చికమే అయినా యద ఆనంద డోలికలూగింది. ఎంత చక్కటి పేరున్న రచయిత, సాహితీ ప్రియులందరూ వలచే  ఆయన సాహిత్యం. అయినా ఆ పేరుకి ఇంకెన్ని అందాలో ! "శరత్ " ఆ పేరు తోటే తనని పిలవగలిగితే , ఆ పేరులో ఉన్న మాధుర్యానికి నోరంతా మధురమై మది నిండి పోదా! అని మృదులకి అనిపించింది. 

                                        
                                      బడి 
                         మొదటి రోజు యాదమ్మ స్కూల్ కి దారి చూపించింది పదిహేను నిముషాల నడక ఉంటుందేమో ! దారిలో అందరూ  యాదమ్మని పలుకరించి ఎవరు అని అడగడమే పట్నం నుంచి మన బడికి వచ్చిన కొత్త పంతులమ్మ అని చెప్పడం వాళ్ళు తన కేసి చిరునవ్వుతో చూడడం తను వాళ్ళని చూసి తిరిగి చిరు  నవ్వులు రువ్వుతూ స్కూల్ ఆవరణ లోకి అడుగుపెట్టింది. 

                             అందరూ దారంతా తన కోసం నవ్వుల పూలు జల్లినట్లు అనిపించింది. పట్నం లో రోజంతా రోడ్లన్నీ నడిచినా ఒక్క నవ్వు దొరకడం అనితర సాధ్యం అనిపించే ఈ రోజుల్లో అన్ని చిరునవ్వులు అక్షింతలల్లే తనని ఆహ్వానించాయి అని ఆనంద పడింది మృదుల మానసం. 

                              ఆ నవ్వు పువ్వులే కోపాలొస్తే తేడాలొస్తే నిప్పురవ్వలై ఎగసి మాటల తూటాలై తన మానసాన్ని పేల్చి పీల్చి పిప్పి చేయగలవని మృదుల తెలుసుకోవడానికి రెండు రోజులు పట్టలేదు. 

                             స్కూల్ గేట్ దాటి లోపలి అడుగు పెట్టగానే ఒక చిన్న ఆట స్థలం లో ఒక కొత్త భవంతి ఏడు గదులవసారాతో " L" ఆకారంలో కనిపించింది. ఒక ఆడమగ  ఇద్దరు దగ్గరికి వచ్చారు, "మీరు వస్తారని సర్పంచ్  చెప్పారు. అందుకే ఊళ్ళో పిల్లలకి కబురంపి అంతా శుభ్రం చేశామండి" అన్నాడు. రెండు గదుల తలుపులు మాత్రం తెరిచి ఉన్నాయి. మిగితా గదులు తాళం వేసి ఉన్నాయి. "పిల్లలంతా ఆ గదిలో కుర్చున్నారమ్మా" అని అటుకేసి చూపించాడు. "నా పేరు రాజయ్య, ఇది నా పెళ్ళాం సూరమ్మ . మీతో బాటు సాయంకాలం దాకా రోజూ ఉంటది. ఏదైనా అవసరం ఉంటే కబురంపండి నేను పంచాయతి ఆఫీస్ కాడ ఉంటాను" అన్నాడు. 

                               ఎంత బాధ్యతగా అన్నీ సమకూర్చారు! సర్పంచ్ మీద గౌరవభావంతో తన మనస్సులో అతనికి ధన్యవాదాలు అర్పించుకుంది. సరే సర్పంచ్ గారికి థాంక్స్ చెప్పానని చెప్పండి అంది . అలాగే అంటూ "థాంక్స్" అని  తలూపుతూ గుర్తుపెట్టుకున్నట్లు అనుకున్నాడు రాజయ్య . అతని చేష్టకు నవ్వుకుంటూ తరగతి గది వైపు నడిచింది మృదుల. 

                                 ఆ స్కూల్ కి  ఒక ఆయా , అటెండర్  కూడా లేరని , తన కోసం పంచాయతీ నుంచి అరువు ఇచ్చారని సూరమ్మ ద్వారా మృదులకి ఆ రోజే తెలిసింది. ఒక సింగల్  టీచర్ స్కూల్ కి ఒకే ఒక టీచర్ అన్నీ తానే అనమాట . అన్నీ తానై ఒక టీచర్ ఇంతై అంతై అంతటా తానే యై  బాధ్యతలన్నీ నెరవేర్చాలని ప్రభుత్వం ఉదేశ్యమేమో ! భగవంతుడా ! అని నిటూర్చింది మృదుల . ప్రస్థుతానికి సర్పంచ్ పుణ్యమా అని తన సమస్య తీరింది. కానీ ఎలాగైనా స్కూల్ కి ఒక ఆయాని , అటెండర్ ని తెప్పించుకోవాలి అని మొదటి నిర్ణయం తీసుకుంది మృదుల . 

                                   తరగతి గదిలోకి అడుగు పెట్టి తెరిపారా  గదినంతా ఒకసారి పరికించి చూసింది . మొదటి బెంచీ మీద వరుసగా నలుగురు ఇరుక్కుని కూర్చున్నారు. రెండో బెంచిలో ఇద్దరు . అలా చాలా పొడుగు చాలా పొట్టి కలిసి వరుస క్రమం లేకుండా బెంచీల వారిగా ఎక్కువగా తక్కువగా దాదాపు ఓ ముప్పై మంది పిల్లలు. రకరకాల వయస్సు వాళ్ళు ఐదు ఏళ్ల నుంచి పన్నెండు ఏళ్ల  వరకు కూర్చున్నారు . పట్టుమని పదిమంది అమ్మాయిలు కూడా లేరు. లెక్కపెడితే ఆరుగురు. ఆ ముప్పై మంది పిల్లలలో కొందరు మాత్రం తనని చూసి నిలబడ్డారు . వాళ్ళని కూర్చోమని సైగచేసి అందర్నీ చూసి మీ పేర్లు చెప్పండి అంది. ఎడమ వైపు మొదటి బెంచీ లో కూర్చున్న నలుగురు కుర్రాళ్ళు లేచి మాది కరణాల వీధి అన్నారు. కుడి వైపు మొదటి బెంచీ లో  నలుగురు కుర్రాళ్ళు లేచి మాది రెడ్ల వీధి అన్నారు. అలా ఒక్కొక్క  బెంచీ వాళ్ళు లేచి వీధుల పేర్లు చెప్పసాగారు ఆఖరున ఒక మూల క్రింద కూర్చున్న ముగ్గురు మాది మాల వాడ అన్నారు. మృదులకి వాళ్ళు చెప్పేది ఏంటో జరుగుతున్నది ఏంటో అర్ధమయ్యే లోపు వాళ్ళ పరిచయ కార్యక్రమం పూర్తి అయిపోయింది. 

                             నేను చెప్పమంది మీ పేర్లు, మీరుండే వాడలు కాదు. అందరూ నిలుచోండి అని అందర్నీ నిలబెట్టింది. వరుసగా లైన్ లో నిలుచోండి అంది. అందరూ మొహామొహాలు చూసుకోసాగారు. వాళ్ళ దగ్గరికి వెళ్లి అమ్మయిలు అందర్నీ వాళ్ళ ఎత్తు ప్రకారం ఒక వరుసలో , అబ్బాయిలు అందర్నీ ఇంకో వరుసలో తనే స్వయంగా నిలుచోబెట్టింది. తొంగి తొంగి తమ వీధిలో వారిని చూసే పిల్లల్ని సరిగ్గా నిలబడమని గద్దించి ముందుకు వచ్చి నిల్చుని వారిని తృప్తిగా ఒకసారి పరికించి చూసుకుంది. 

                               ఎవరో ఇద్దరికి తప్ప మిగితా వారికి సరైన దుస్తులు లేవు. కొంతమందికి చింపిరి జుట్టు , కారుతున్న ముక్కులు నోట్లో వేళ్ళతో మరో చేతుల్తో నిక్కర్లు పైకి లాక్కుంటూ మాసిన బట్టలు మురికి పట్టిన మొహాలు చూస్తే పొద్దుటినుండి మట్టిలో ఆడి వచ్చినట్లు ఉన్నారు . అస్సలు వీళ్ళు స్నానం చేశారా ! అనే అనుమానం కూడా వచ్చింది మృదులకి.

                                అందమైన అమాయకత్వానికి మసి పూసినట్లు ఉన్నారు వాళ్ళు.  ఆ అజ్ఞాన మలినాన్ని తన విద్యా వస్త్రంతో శుభ్రపరచి వాళ్ళని విద్యను ప్రతిబింబించే అమలిన అద్దాలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకుంది మృదుల. కానీ రేపటి  సమాజంలో ఆ  చిన్నారులే సానబెట్టిన వజ్రాలై  రాటుదేలుతారని తళుక్కున మెరుస్తారని మృదులకి ఆ రోజు తెలియదు. 

                                     వాళ్ళ చేత చేతులు నమస్కార ముద్రలో పెట్టించి ప్రార్థనా గీతం తను పలుకుతూ వాళ్ళ చేత పలికించింది. తరువాత బెంచీకి ముగ్గురు చొప్పున పది బెంచీలలో కుర్చోపెట్టింది. ఆశ్చర్యంగా ఒకరిని ఒకరు చూసుకుంటూ దూరం దూరంగా జరిగి కూర్చున్నారు . రోజూ ఇలాగే కూర్చోవాలి అని ఆజ్ఞ జారీ చేసింది. అర్థమైందా అనే తన ప్రశ్నకు  అందరూ చక్కగా తలలు ఊపారు. అప్పుడు వాళ్లకి శుభ్రత గురించి , వాళ్ళు రోజూ వేసుకోవాల్సిన దుస్తుల గురించి , రోజూ సాయంత్రం మాత్రమే ఆడుకోవాలని ప్రొద్దునే ఆడి బట్టలు మాపుకోవద్దని ఇలా ఎన్నో మంచి బుద్దులు చెప్పి వాళ్ళ చేత అవే మళ్ళీ మళ్ళీ చెప్పించింది పునరావృతం చేసింది. 

                            
                    సౌందర్య చిత్రం... చిత్రకారుడి విచిత్రం  
                                  
                               సహజంగా ఏ కళాకారుడైనా స్ఫూర్తి దాయకమైన వస్తువు ఎదురుగా ఉంటే వర్ణ చిత్రం రూపొందించగలడు . అలాగే కవితా చిత్రం , కథా చిత్రం మరియు వాక్ చిత్రం గీయడానికి కూడా ఒక చిత్ర వస్తువు అవసరం అవుతుంది కానీ ఒక పూర్తి ఊహా చిత్రం వేయడం ఒక అద్వితీయమైన కళ . 

                               అటువంటి ఒక అందమైన  చిత్రంలో పూర్తిగా లీనమైపోయింది మృదుల. అర్థమిళిత కన్నులతో ధ్యానమగ్నుడైన ఓ పురుషుడు . అదే వ్యక్తి తన చేతిపై చేయి వేసిన ధ్యాన ముద్ర క్రింది నుండి ఓ తెల్లటి తేజస్సు అగ్నిరూపంగా మారి అతని చుట్టూ వ్యాప్తి చెందుతూ   పైకి పైకి ఎగసి చక్రాలని దాటుకుంటూ  ఆజ్ఞా చక్రం వద్ద ఆగింది  బంగారురంగులో మెరుస్తూ మళ్లి తెలుపురంగులోకి మారుతున్న తేజస్సు చుట్టూ విచ్చుకున్న ఓ మనోనేత్రం 


                              ఆ చిత్రాన్ని దాటి మృదుల కన్నులు మరో చిత్రం పైకి మరలాయి.  అందులో అదే ధ్యానపురుషుని అర్ధభాగం చిత్రించబడి ఉన్నది . అతని హృదయ స్థానంలో చిత్రించిన చిత్రం.  అతని హృదయ కవాటాలు తెరుచుకున్నచిత్రం. కవాటాలకి ఆవలి వైపు ఆర్ద్రత నిండిన కన్నులతో ఓ ప్రౌఢ స్త్రీ, ఈవల వైపు అతను. ఆ చిత్తరువులో అతని కంటే ముందు మరో తాను అయిన అతను  చేతులు చాచి ఆహ్వానిస్తున్న బాహుద్వయం తో నిలబడి ఉండగా మరో తాను అయిన ఆమె ఆతృతతో కవాటాలను దాటుతూ ఉద్వేగంతో చెలియలి కట్ట దాటి  ఉప్పొంగే సంద్రంలా పరువులెత్తుకొస్తున్న    సాదృశ్య వీచికా చిత్రం. మనసులో మనస్సును తెలిపే చిత్రం. 

                                        
                                  ఆ చిత్రాన్ని సుతారాము దాటి రామంటున్న కన్నులకు  ఉత్సుకత గాలం వేసి ఇంకో చిత్రంమీదికి వాటిని బలవంతంగా తీసుకువెళ్ళింది. ఆ మరో చిత్రం అతని కౌగిలిలో అద్వైత విలీనమై సంద్రంలో కలిసిన నదిలా , సహజాత సమన్వయమైన కోరికలా ఆమె ఒదిగిన వైనం ఆ అనురాగ కావ్య చిత్రం . 
                              
                               రసనాగ్ర భావాన్ని దీప్తిమంతం చేసే చిత్ర సౌందర్యం . తనకి ఆ చిత్రాలలో స్త్రీకి తేడా లేనట్టు తన్మయత్వంతో మమేకమై వీక్షిస్తూ నిలబడిన మృదులని లావణ్య తట్టి పిలిచే వరకు తాను స్పృహ లోకి రాలేదు. 

                               "మీరు ఈ గదిలోకి ఎలా వచ్చారు?" అడిగింది లావణ్య విసుగ్గా . తన విసుగుని, ప్రశ్నని గమనించే స్థితిలో లేదు మృదుల . "ఈ పెయింటింగ్స్ ఎవరు వేశారు ?" అని అడిగింది . "ఇంకెవరు అన్నయ్య , ఇది అన్నయ్య గది" అన్నది లావణ్య. వసారాలో తిరుగుతుంటే తలుపు తీసి ఉంది పెయింటింగ్స్ కనిపిస్తే చూద్దామని వచ్చాను . చాలా బాగున్నాయి . ఈ పెయింటింగ్ తరువాత ఇంకో పెయింటింగ్ ఉందా అడిగింది. లావణ్య విచిత్రంగా మృదులని చూసి నాకు తెలియదు అంది . "లేదు లావణ్య  ఉండే ఉంటుంది ఏదో అసంపూర్తిగా అనిపించడం లేదూ !" . నవ్వుతూ నాకనిపించడం లేదు అంది లావణ్య .  ప్రక్క గదిలో అన్నీ అన్నయ్య వేసిన పెయింటింగ్స్ కానీ వాటిని ఎవ్వరిని చూడనీయడు . ఎప్పుడో ఎక్సిబిషన్ పెట్టిస్తాడు అప్పుడే చూడాలి అందరం అంది . అంతవరకు నాకు ఆగే ఓపిక లేదు అని మనసులో అనుకుంటూ  ఆ గదిని అప్పుడు పరికించి చూసింది. చాలా సీదా సాదాగా ఉన్న గది . చుట్టూ కిటికీలు . గోడకి వారగా వేసిన ఇరువురికి సరిపడా మంచం దానిపై పొందికగా అమర్చిన పరుపు దుప్పటి ఒక పేయింటింగ్ స్టాండ్ పైన ఆఖరి చిత్రం ప్రక్కనే కుంచెలు రంగులు ముందు వేసిన చిత్రాలు గోడకి వారగా కిటికీల గట్టు అంచులపై  నిలబెట్టి ఉన్నాయి. ఎంత బావుందో గది అని తను అనుకుంటుండగానే బలవంతాన తనని లావణ్య బలవంతాన బైటికి లాకొచ్చి తాళం వేసింది. ఆ చిత్రాలని వొదలలేక వొదిలి వచ్చింది మృదుల. అన్నయ్య చూస్తే అంతే సంగతి అంటూ తాళాల గుత్తిని ఒక గదిలో మూల తాళం కప్ప ఆకారంలో ఎంతో అందంగా చెక్కిన చెక్క ఆకృతి పై ఓ శీలకి తగిలించింది. అలాగా అంటూ ఆ తాళాల గుత్తిని బాగా గుర్తుపెట్టుకుంది మృదుల ఎలాగైనా సరే  ఆ చిత్రాలన్నీ తాను చూడాల్సిందే అని అప్పుడే  నిశ్చయించేసుకుంది మృదుల. 

                    రోజులు  గడుస్తున్నా కొద్దీ  మృదుల మదిని ఆ చిత్రాల గదిని చూడాలనే ఆలోచన తొలుస్తూనే ఉంది. ఆ అవకాశం రానే వచ్చింది , ఇంట్లో  ఎవరూ లేని సమయం చూసుకుని మెల్లిగా ఆ గదిలో అడుగు పెట్టింది మృదుల ఆ గది ,పుస్తకాలున్న గది కన్నా చిన్న గదే కానీ ఆ గదిలో ఎక్కడ చూసినా వరుసగా పేర్చిన చిత్ర పటాలే . గది మధ్యలో మరో చిత్ర లేఖనం స్టాండ్ కుంచెలు రంగులు ఉన్నాయి .  ఇన్ని పటాల మధ్యలో తనకి  కావాల్సిన ఆ నాల్గవ చిత్రపటాన్ని ఎలా వెతకడం అనుకుంటూ యథాలాపంగా ఒక పటాన్ని చేతుల్లోకి  తీసుకుని దాని మీద ఉన్న దుమ్ముని చీర చెంగు అంచుతో సుతారంగా తుడుస్తూ ఆ చిత్రాన్ని చూడసాగింది . నిండు పున్నమి వెన్నెలలో పారుతూ తడుస్తున్న ఓ వాగు ఆ మెరుస్తున్న ఒడ్డున కూర్చోగలిగితే ఎంత అందమో అనుకుందో లేదో ఆ భావమే నిజమైన చందాన తనని తాను ఆ వెన్నెల వాగు ఒడ్డున సాక్షాత్కరించుకుంది . ఇంతలో గది బైట ఏదో శబ్దం గదిలో ఒక మూలకి దాదాపు దాక్కున్నట్లు జరిగింది. లోపలికి వచ్చిన వ్యక్తిని చూసి మదిలో భయంతో "దేవుడా " అని దణ్ణం పెట్టుకోసాగింది. గది మధ్యలో నిలబడి ఆ వ్యక్తి వెనక్కి తిరిగైనా చూడకుండా "పంతులమ్మలు ఇలాటి పనులు చేయడం తప్పు కదూ" అంటుంటే దొరికిపోయిన దొంగలా మృదుల "మరి ఇంత అందమైన పెయింటింగ్స్ ఎవర్ని చూడనీయకుండా అందర్నీ భయపెట్టి దాచేస్తే ఎవ్వరైనా ఇదే పని చేస్తారు"అంది తనని తాను సమర్ధించుకుంటూనే.  "అయినా మీ పెయింటింగ్స్ ఏమి దొంగతనం చేయలేదు లెండి" ఉక్రోషంగా అంటూ బైటికి వచ్చేసింది మృదుల. 

                      "ఏమనుకున్నాడో మహానుభావుడు తనలా చేసినందుకు సున్నితంగానే వాత పెట్టాడు" అని కాసేపు మధన పడింది. కానీ అతను అటు తిరిగి ఉన్నందున అతని చిరుహాసాన్ని చూడలేకపోయింది.  తెల్లారి కల్లా ఆ తాళాల గుత్తి మాయమైంది . వాటిని  అతను తన దగ్గరే ఉంచుకున్నా డని అర్థమైంది దానితో బాటు అతను తన చిత్ర లేఖనం గది లోకి తను వెళ్లడం ఇష్టం లేదని మృదుల అర్థం చేసుకుని కాస్త బాధ పడి తన స్థాయిని తాను గుర్తు తెచ్చుకుని తనని తాను సర్ది పుచ్చుకుంది.